-
బెంగళూరు, చెన్నై, ముంబైకి..
-
అలైన్మెంట్ తో పాటు భూసేకరణ అంశంపై కసరత్తు
-
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కిషన్ రెడ్డి కీలక చర్చలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ బ్యూరో: హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్స్ విషయంలో కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. అందుకు సంబంధించి ఇప్పుడు కార్యాచరణ మొదలెట్టింది.
బుల్లెట్ ట్రైన్స్ రూట్ లకు సంబంధించి అలైన్మెంట్ తో పాటు భూ సేకరణ అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ప్రతిపాదిత రూట్, భూ సేకరణ వ్యయంతో పాటు రైల్వే శాఖ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన తాజాగా సమీక్ష నిర్వహించారు.
ఇదే అంశంపై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి కూడా పలు అంశాలను వెల్లడించారు. దీంతో హైదరాబాద్ నుంచి కొత్త బుల్లెట్ ట్రైన్స్ కు సంబంధించి క్లారిటీ వస్తోంది. బుల్లెట్ ట్రైన్స్ హబ్ గా హైదరాబాద్ మారుతోంది.
-
మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన..
భాగ్యనగరం నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ల కారిడార్లను నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ -చెన్నై.. హైదరాబాద్- బెంగళూరు.. హైదరాబాద్- ముంబై కారిడార్లు ఉన్నాయి. ఈ కారిడార్లకు సంబంధించి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
అలైన్మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూ సేకరణ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు.
ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో కిషన్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. చెన్నై, బెంగళూరు, ముంబైలకు కనెక్టివిటీ కల్పిస్తూ ప్రతిపాదించిన హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు సంబంధించి అలైన్మెంట్లపై చర్చించారు.
-
ప్రతిపాదనల తరువాత..
ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదన లేకుండా భూసేకరణ చేపట్టడం చట్ట విరుద్ధమని.. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పేరుతో ఎవరైనా భూమిని సేకరిస్తే అది ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.
అలైన్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. అలైన్మెంట్, మార్కింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి కిషన్ రెడ్డి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అలైన్మెంట్ ఖరారు అయిన తర్వాత ప్రభుత్వాలు, రైతులకు పూర్తి సమాచారం అందిస్తామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అశ్విని వైష్ణవి తెలిపారు. అయితే బెంగళూరు తో పాటు చెన్నై వెళ్లే ఈ బుల్లెట్ ట్రైన్స్ కు సంబంధించి ఏపీకి కూడా అనుసంధానించనున్నారు.
