-
వ్యవస్థ పేరు చెప్పి భారీగా వసూళ్లు
-
పెద్ద ఎత్తున అందుతున్న ఫిర్యాదులు
-
స్పందించిన ఉన్నతాధికారులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైడ్రాకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్న వ్యవస్థ పేరు చెప్పి కొంతమంది వసూళ్ల పర్వానికి తెర లేపారు. హైడ్రా పేరు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలు హైదరాబాదులో పెరిగిపోయాయి.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, బాధితుల నుంచి నేరుగా అందుతున్న ఫిర్యాదులతో హైడ్రా ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తోంది. తమ సంస్థ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.
-
ఆ భయాన్ని క్యాష్ చేసుకుని..
హైడ్రా అంటేనే హైదరాబాదులో ఒక రకమైన భయం ఉంది అక్రమార్కుల్లో. దానిని క్యాష్ చేసుకునేందుకు కొందరు రంగంలోకి దిగారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు దిగుతున్నారు. హైడ్రా చర్యలు లేకుండా తాము అడ్డుకుంటామని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
ఇంత మొత్తంలో కడితే హైడ్రా ఇక మీ జోలికి రాదు అని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో చాలామంది చెల్లింపులు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైడ్రా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ దందాలను అరికట్టేందుకు హైడ్రా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైడ్రా ప్రతినిధుల మని చెప్పుకుంటూ ఎవరైనా బెదిరింపులకు దిగితే.. నగదు అడిగితే ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. నేరుగా హైడ్రా కార్యాలయానికి కానీ.. అవినీతి నిరోధక శాఖకు కానీ.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాధితులు తక్షణమే సమాచారం అందించేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, హైడ్రాక్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1070 కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
-
అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం…
హైడ్రా పేరుతో వసూళ్ల పర్వం నడుస్తున్న తరుణంలో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. అక్రమ నిర్మాణాలు లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై స్వతంత్రంగా, ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని సంస్థ తేల్చి చెప్పింది.
కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపల్ అధికార యంత్రాంగాల నుంచి అధికారిక విజ్ఞప్తులు, ఆదేశాలు అందినప్పుడు మాత్రమే కూల్చివేతల ప్రక్రియ చేపడతామని స్పష్టం చేసింది.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా శిథిలవస్థకు చేరిన ప్రమాదకర భవనాల తొలగింపు విషయంలోనూ.. మున్సిపల్ విభాగాలు కోరితేనే రంగంలోకి దిగుతామని.. తమ పేరుతో జరిగే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కూడా పేర్కొంది హైడ్రా.
భద్రతా ప్రమాణాలు పాటించని హాస్టల్ల విషయంలోనూ హైదరాబాద్ తన గడువును మరోసారి గుర్తు చేసింది. నివాసితుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర భవనాల్లో హాస్టళ్లు నడపడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ.. వాటిని తక్షణమే సురక్షితమైన ప్రదేశాలకు మార్చుకోవాలని నిర్వాహకులకు ఆదేశించింది. అందుకోసం డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఈ గడువులో ఎలాంటి మార్పులు ఉండవని కూడా స్పష్టం చేసింది.
