-
దసరాకు ముందే గుడ్‌న్యూస్.. తెలంగాణ ఉద్యోగుల ఖాతాల్లో డీఏ డబ్బులు
-
రెండు విడతల డీఏ పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు
-
నవంబర్ 1న పెరిగిన డీఏతో అక్టోబర్ జీతం
-
జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు బకాయిలు జీపీఎఫ్‌లో జమ
-
దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
హైదరాబాద్, అక్టోబర్: పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏకు సంబంధించి రెండు విడతలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఉద్యోగుల వేతనాల్లో డీఏ భాగం ఇకపై పెరగనుంది. పెరిగిన మొత్తంతో పాటు గత బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
-
6.37 శాతం పెరగనున్న డీఏ
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2024 జనవరి 1 నుంచి వర్తించే డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి సవరించారు. అలాగే 2024 జూలై 1 నుంచి మరోసారి పెంచి 40.04 శాతంగా నిర్ణయించారు. రెండు సవరణలను కలిపితే ఉద్యోగులకు డీఏలో మొత్తం 6.37 శాతం పెరుగుదల లభించనుంది. ఈ పెంపు అక్టోబర్ నెల జీతంలోనే ప్రతిఫలించనుంది. అంటే నవంబర్ 1న ఉద్యోగుల ఖాతాల్లో జీతం జమయ్యే సమయంలో సవరించిన డీఏ కూడా అందనుంది.
-
పాత బకాయిలకు కూడా క్లారిటీ
కొత్త డీఏతో పాటు ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం విధానం ప్రకటించింది. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు పేరుకుపోయిన మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిలను దశలవారీగా చెల్లించాలని నిర్ణయించారు.
-
ఖజానాపై భారీ భారం
డీఏ సవరణ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా గణనీయమైన భారం పడనుంది. ప్రతి సంవత్సరం సుమారు రూ.2,500 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు దాదాపు రూ.6,174 కోట్లు అవసరమవుతాయి.
మొత్తంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అర్హత ఉన్న ఇతర సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు డీఏ విడుదలకు ప్రభుత్వం ముందుకెళ్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వెల్లడించారు.
