భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన పాత ఆరోపణలపై కేరళ ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆయన కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) సెక్రటరీగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న పరిణామాలపై ఈ విచారణ కొనసాగనుంది. కాంగ్రెస్ నేత మలయిన్‌కీళు వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర హోంమంత్రి రమేశ్ చెన్నితాల ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారం దాదాపు రెండు దశాబ్దాల నాటిది. 2006లో కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (కేఎస్‌టీపీ)లో భాగంగా ఎంసీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న పాటి-బెల్ కన్సార్టియం తరఫున పనిచేసిన మలేషియాకు చెందిన సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్.. కేరళ నుంచి తిరిగి వెళ్లిన అనంతరం అదే ఏడాది నవంబర్‌లో కౌలాలంపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లీ సీ బీన్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో అప్పటి పీడబ్ల్యూడీ సెక్రటరీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంపై 2006లో నిర్వహించిన ప్రాథమిక విజిలెన్స్ విచారణ కూడా బాహ్య ఒత్తిళ్ల ప్రభావానికి గురైందని వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పాత దర్యాప్తు ఫైళ్లపై ప్రభుత్వం దృష్టి
ఈ ఆరోపణలను పరిశీలించాలని నిర్ణయించిన కేరళ ప్రభుత్వం.. గతంలో జరిగిన విజిలెన్స్ విచారణకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ)ని ఆదేశించింది. అప్పటి దర్యాప్తు ఏ విధంగా సాగింది? విచారణపై నిజంగా ఎవరైనా బయటి నుంచి ప్రభావం చూపించారా? అనే అంశాలను ప్రస్తుత పరిశీలనలో ప్రధానంగా పరిశీలించనున్నారు.
నాటి విచారణలో జోక్యం జరిగిందన్న ఆరోపణలపై సమగ్రంగా దర్యాప్తు చేసి, వాస్తవాలను నివేదిక రూపంలో అందించాలని విజిలెన్స్ డైరెక్టర్‌కు హోంమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
అయితే, సూసైడ్ నోట్‌లో పేరు ప్రస్తావనకు రావడం లేదా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం మాత్రమే జ్ఞానేశ్ కుమార్ తప్పు చేసినట్లు నిర్ధారించదు. ప్రస్తుతానికి ప్రభుత్వం పాత కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం, అప్పటి దర్యాప్తుపై వచ్చిన జోక్యం ఆరోపణల్లో వాస్తవం ఎంతవరకు ఉందో తెలుసుకోవడంపైనే దృష్టి సారించింది. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
also read: టీవీకే కీలక నిర్ణయం.. ఇండియా కూటమిలో విజయ్ పార్టీ చేరిక
