క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దించేందుకు భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత..గత మూడు ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఒక్కసారి మాత్రమే గెలిచారు. అయితే ఈసారి చింతల రామచంద్రారెడ్డిని కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోదించాలన్న డిమాండ్ వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీలో. ఏడు పదుల వయసు దాటిన చింతల రామచంద్రారెడ్డిని కాకుండా.. కొత్త నాయకుడికి టికెట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన మాధవి లత, మరోవైపు చీకోటి ప్రవీణ్ పేర్లు తెరపైకి వస్తున్నాయి.
టికెట్ రేసులో మాధవి లత..
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తరఫున హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు కొంపెల్లి మాధవి లత. స్వచ్ఛంద సేవకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం పలుమార్లు వివాదాస్పదం కూడా అయింది. అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో ఏకంగా 3,23,894 ఓట్లు సాధించారు. అయితే ఈసారి ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో హిందువులు, తటస్తుల ఓట్లతో విజయం సాధించాలన్న ఆలోచన చేస్తున్నారు. నేరుగా అధిష్టానానికి ఆమె మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. హై కమాండ్ సానుకూలంగా ఉన్నట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
ఈడీ కేసులతో బీజేపీలో చేరి..
ఇంకోవైపు చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. క్యాసినోలు, జూదం వ్యాపారాల నిర్వహణలో ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఈడి దాడులు ఎదుర్కొన్నారు ప్రవీణ్ కుమార్. ఆ తరువాత బిజెపిలో చేరారు. పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి పోటీ చేసేందుకు ఆయన గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది పెద్దల ద్వారా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
చింతల రామచంద్రారెడ్డి సైతం..
అయితే తనకు ఇది చివరి అవకాశం అని.. టిక్కెట్ ఇవ్వాలని చింతల రామచంద్రారెడ్డి కోరుతూ వచ్చారు. తొలిసారిగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు రామచంద్రారెడ్డి. ఆ ఎన్నికల్లో 16 వేల ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో 53,102 ఓట్లు సాధించి దానం నాగేందర్ పై విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో 34,666 ఓట్లకు, 2023 ఎన్నికల్లో 38,094 ఓట్లకు పరిమితం అయ్యారు. అందుకే ఈసారి చింతల రామచంద్రారెడ్డి స్థానంలో కొత్తవారిని బరిలో దించి ఓటర్లను ఆకట్టుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.
