విమాన ప్రమాదాన్ని అడ్డుకుని వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం లభించింది. తీవ్ర గాయాలతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు స్మిత్ చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు.
స్మిత్‌ను కలిసిన సందర్భంగా యువరాజు ఆయన పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణికుల రక్షణ కోసం పోరాడిన ఆయన ధైర్యం అభినందనీయమని పేర్కొన్నారు. స్మిత్ చేసిన సాహసం యూఏఈ నాయకత్వానికి గర్వకారణమని తెలిపారు.
మానవ ప్రాణాలకు విలువ ఇవ్వడం, దయ, శాంతి వంటి విలువలకు స్మిత్ ప్రతీకగా నిలిచారని యువరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్మిత్‌తో మాట్లాడుతున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో పైలట్‌ను యువరాజు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
సహ పైలట్ దాడి.. గాయాలతోనే పోరాటం
ఇటీవల విమానంలో చోటుచేసుకున్న ఘటనలో సహ పైలట్ దాడికి కెప్టెన్ స్మిత్ గురయ్యారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. విమానాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు గాయాల మధ్యే పోరాడారు.
అనంతరం కాక్‌పిట్ తలుపు తెరుచుకోవడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంలో కెప్టెన్ స్మిత్ కీలకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాల పరిస్థితిలోనూ ఆయన ప్రదర్శించిన తెగువ, బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
కష్ట సమయంలో పైలట్‌గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన స్మిత్‌ను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా దుబాయ్ యువరాజు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం ఆయన సాహసానికి లభించిన ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
also read: అల్లు అర్జున్ ‘రాకా’లో ఐశ్వర్య లక్ష్మి లేరట.. వైరల్ ప్రచారంపై నటి క్లారిటీ
