-
సామాజిక వర్గాల సమతుల్యంలో వైసీపీ విఫలం
-
ఈ విషయంలో అధిగమించిన కాంగ్రెస్, టిడిపి
-
ధర్మాన సోదరుల ఆధిపత్యం పై రగిలిపోతున్న తమ్మినేని
-
దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి సొంత రాజకీయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. విజయనగరంలో చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ధర్మాన సోదరులకు వ్యతిరేకంగా తమ్మినేని సీతారాం పావులు కదుపుతున్నారు.
వైసిపి నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ తో జత కలిశారు. దీంతో వారిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గట్టి సవాల్ విసురుతున్నారు. తమను నిర్లక్ష్యం చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ ఖాయమని తేల్చి చెబుతున్నారు.
ఇద్దరూ ఇప్పుడు కలిసి తిరుగుతుండడం.. కలిసి ప్రకటనలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. కుల అంశాన్ని తెరపైకి తెచ్చి పోరాటం చేయడానికి ఇరువురి నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
-
అన్ని కులాలకు ప్రాధాన్యం..
శ్రీకాకుళం జిల్లా రాజకీయ పరిస్థితులు ఒకసారి గమనిస్తే.. కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం ప్రధాన కులాలను సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుల రాజకీయాలను సర్దుబాటు చేసుకోలేక సతమతం అవుతుంది.
టిడిపి నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. వాస్తవానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత దశాబ్ద కాలంగా వెలమలది రాజకీయ ఆధిపత్యం. అయినా సరే మిగిలిన సామాజిక వర్గాలను చేరదీస్తూ టిడిపి ముందుకు సాగింది.
ఆ రకమైన అసంతృప్తి కులాల మీద పడనీయకుండా జాగ్రత్త పడుతోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ సమీకరణలు సరిచేసుకుంది. కానీ ఓటమి తర్వాత మాత్రం పరిస్థితి చేయి దాటుతోంది. అంతిమంగా అది పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది.
-
తమ్మినేనిది గొప్ప ప్రస్థానం..
జిల్లా రాజకీయాల్లో తమ్మినేని సీతారాం ది ప్రత్యేక స్థానం. 1983 నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచారు. రెండుసార్లు మంత్రి కూడా అయ్యారు. వైసీపీ నుంచి ఒకసారి గెలిచి శాసనసభ స్పీకర్ అయ్యారు. గతంలో కాలింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాల్ రావు సుదీర్ఘకాలం శ్రీకాకుళం ఎంపీగా పనిచేశారు.
కాంగ్రెస్లో కాలింగ్ లకు ప్రాధాన్యం ఉండేది. తరువాత వెలమల ప్రాధాన్యం పెరిగింది. టిడిపి సైతం కాలింగ్ ఇస్తూనే వెలమలకు కూడా కీలక పదవులు కట్టబెట్టింది. కానీ వైసీపీ మాత్రం ఆ రెండు వర్గాలను దగ్గరకు తీసుకునే క్రమంలో ఎక్కడో సమతుల్యత కొరవడింది. ఫలితంగా ఇప్పుడు కాళింగ సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది..
-
ఆ ఇద్దరూ ఒక్కటై..
కొద్ది నెలల కిందట కుటుంబ వివాదంతో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అటు తరువాత తమ్మినేని సీతారాం కు ప్రాధాన్యత తగ్గింది. మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సామాజిక ఆధిపత్య పోరుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు.
జిల్లాలో ధర్మాన సోదరులు చెప్పినట్లుగానే పార్టీ నడుస్తోంది అనే భావన కాళింగ సామాజిక వర్గంలో బలపడుతోంది. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే సొంత అజెండాతో తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
