-
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన
-
ఆమోదముద్రవేసిన ఏఐసీసీ నాయకత్వం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. వారి పేర్లను అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.
ఈ మేరకు అభ్యర్థుల తుది జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి బరిలో దిగుతున్నారు.
నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానానికి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆ ఇద్దరు నాయకులకు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, విద్యార్థి దశ నుంచి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను పరిగణలోకి తీసుకొని వారి అభ్యర్థిత్వలను ఖరారు చేసింది.
-
ముందుగానే కసరత్తు..
వాస్తవానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి.. అభ్యర్థుల ఎంపికను ముందుగానే కసరత్తు ప్రారంభించింది. మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహాలకు ఆ బాధ్యతలు ఇచ్చింది. వారు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫైనల్ గా ఒక్కో స్థానానికి ముగ్గురు పేర్లను సిఫార్సు చేశారు.
రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి అవే నివేదికలను పంపించగా.. ఈ మేరకు ఎంపికలను పూర్తి చేసింది అగ్రనాయకత్వం. సామాజిక సమీకరణలు, అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలించి.. వారిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-
ఇప్పటికే ఫోకస్..
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు ఒకరకంగా ఇది రేవంత్ సర్కార్కు పరీక్ష.
అందుకే చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సీఎం రేవంత్ తో పాటు ఇతర పిసిసి ముఖ్య నేతల అభిప్రాయాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు సీఎం రేవంత్.
-
తప్పకుండా ప్రభావం..
మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానంలో పట్టణ ఓటర్లు, ఐటీ నిపుణులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ యువతలో మంచి గుర్తింపు ఉన్న సామ రామ్మోహన్ రెడ్డిని నిలబెట్టడం ద్వారా సానుకూల ఫలితాలు సాధించవచ్చు అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది.
ఇంకోవైపు ఉద్యమాలకు చిరునామాగా ఉన్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టబద్రుల నియోజకవర్గంలో విద్యావంతుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిగా పార్టీ గెలుపునకు దోహదం చేస్తుందని స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ రెండు స్థానాల్లో గులాబీ పార్టీ, భారతీయ జనతా పార్టీ సైతం అభ్యర్థులను రంగంలోకి దించనున్నాయి. అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటనతో ఆ రెండు పార్టీలు ఇప్పుడు అలర్ట్ అయ్యాయి.
