-
సోదరుడిపై ఘాటు వ్యాఖ్యల వెనుక బలమైన కారణాలు
-
తెలంగాణ రక్షణ సేన ఎదగకుండా తెర వెనుక పావులు
-
నేతలు రాకుండా నిలువరింత.. ఆపై ఆర్థిక ఇబ్బందులు పెడుతున్న వైనం
-
అందుకే టిఆర్ఎస్ అధినేత్రి ఉగ్రరూపం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ పై కవిత ఎందుకు ఫైర్ అవుతున్నారు? శృతి మించి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? గుట్టు విప్పుతానని ఎందుకు హెచ్చరిస్తున్నారు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు కవిత.
టిఆర్ఎస్ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు హరీష్ రావు పై దాడి చేసిన ఆమె.. అకస్మాత్తుగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
నాతో పెట్టుకోకు అంటూ నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. నేను నీలాగా విషనాగుల మాటలు విని మాట్లాడను.. నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు కవిత. ఉన్నట్టుండి కవిత ఈ స్థాయిలో విరుచుకుపడుతుండడంపై తెలంగాణ సమాజంలో బలమైన చర్చ జరుగుతోంది.
-
కేటీఆర్ అడ్డగింత..
ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని కవిత పదే పదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తన పార్టీ వైపు నాయకులు రాకుండా కేటీఆర్ నియంత్రిస్తున్నారని పక్కా సమాచారం కవిత వద్ద ఉంది.
పైగా ఆర్థికంగా సైతం ఇబ్బందులు సృష్టించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే సోదరుడని చూడకుండా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆమె భారీ యుద్ధానికి తెర తీసినట్లు అర్థమవుతోంది. ముందుగా కేటీఆర్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఆమె గట్టిగానే వ్యాఖ్యలు చేశారు.
గులాబీ పార్టీ ఓటమికి కేసీఆర్ నిర్ణయాలే కారణమంటూ పార్టీ సమీక్షల్లో కేటీఆర్ చేసిన విశ్లేషణలను ఆమె ఎండ గడుతున్నారు. నీ వైఫల్యాన్ని, చేతగానితనాన్ని తీసుకెళ్లి పెద్దాయన కేసీఆర్ ఖాతాలో వేస్తావా? విజయం నీది.. ఓటమి వస్తే డాడీదా? అంటూ కడిగి పారేశారు. పార్టీలో అవినీతి గుంట నక్కను ప్రశ్నించినందుకు నన్ను గంటల్లో సస్పెండ్ చేశారు..
మరి అదే వ్యక్తితో అంటగాకుతూ.. ఓ గుంట నక్క మైండ్ గేమ్ లో పడి పార్టీ అధినేత విధానాలనే తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్యలు కాదా? అంటూ కవిత సూటిగా నిలదీశారు కేటీఆర్ ను. ఫామ్ హౌస్ లు, అక్రమ అనుమతులు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలుతో పార్టీని పాతాళానికి తొక్కింది కేటీఆర్ అంటూ సొంత చెల్లెలు ఆరోపించడం మాత్రం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడింది.
-
బయట పెడతానని హెచ్చరిక..
ప్రతి రాజకీయ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య విభేదాలు అనేవి సహజం. కానీ కవిత నేరుగా కేటీఆర్ అహంకారాన్ని, ఆయన వ్యక్తిగత శైలిని వేలెత్తి చూపారు. సమావేశాల్లో కార్యకర్తలను, రైతులను, చివరకు సాయం కోరి వచ్చిన మహిళల మాతృత్వాన్ని అవమానించేలా మాట్లాడిన తీరును ఆమె సోషల్ మీడియాలో ప్రస్తావించడం.. కేటీఆర్ ను ప్రజల్లో నైతికంగా ఇబ్బందుల్లో పెట్టేలా ఉంది.
గణేష్ నిమజ్జనంలో కెసిఆర్ పాటలను పెట్టేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను బతిమిలాడుకున్నారంటూ కవిత బహిర్గతం చేసిన వ్యవహారం గులాబీ పార్టీని డ్యామేజ్ చేసేది. తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు కేటీఆర్ తెరవెనుక కుట్రలు చేస్తున్నారని గ్రహించిన కవిత.. పదే పదే నువ్వు నన్ను దెబ్బతీయాలని చూస్తే.. నీ బండారాలన్నీ బజారున పడేస్తానన్న రీతిలో హెచ్చరించారు. తద్వారా తనను కెలికితే గులాబీ పార్టీ ఉనికికి ప్రమాదం అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి అయితే కేటీఆర్ పై కవిత ఆరోపణల వెనుక పెద్ద కధే నడిచింది.
