-
ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి కి సైతం
-
వివేకా హత్య కేసులో ఈడి సంచలనం
-
వారిద్దరూ విచారణకు హాజరయ్యే అవకాశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి చాలా వేగవంతంగా పావులు కదుపుతోంది. ఈ కేసులో ఆర్థిక మూలాలను, మనీలాండరింగ్ కోణాన్ని తవ్వుతోంది. నేరుగా అసలు సూత్రధారుల వద్దకు ఈ విచారణ చేరింది. ప్రధానంగా ఈ కేసులో హత్య కోసం రూ. 40 కోట్ల సుపారి ఒప్పందం జరిగిందన్న ప్రధాన ఆరోపణల పై దృష్టి సారించింది ఈడి.
కీలక నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఎర్రి గంగిరెడ్డి లను సుదీర్ఘంగా విచారించింది. వీరి నుంచి సేకరించిన స్టేట్మెంట్లు, డిజిటల్ ఆధారాలు, గతంలో జరిపిన సోదాల ఆధారంగా హత్యకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చింది వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి లేనని స్పష్టమైన సమాచారం ప్రచారం నడుస్తోంది. త్వరలో వారిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
-
సిబిఐ చేతులెత్తేసినా..
అయితే 8 సంవత్సరాలుగా సిబిఐ విచారణ కొనసాగుతూ వచ్చింది. అనేకరకాల గందరగోళాలు కొనసాగాయి. ప్రధానంగా రాజకీయ ఒత్తిళ్లు, చట్టపరమైన చిక్కుల వల్ల ప్రధాన సూత్రధారులు, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన పెద్ద తలకాయలు బయటకు రాకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు బలంగా వినిపించాయి. ఒకానొక సమయంలో సిబిఐ కూడా చేతులు ఎత్తేసింది.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈడీ రంగంలోకి దిగింది. మనీ ట్రైల్ పై దృష్టి పెట్టడంతో పూర్తిగా సీన్ మారిపోయింది. నాలుగు కోట్ల రూపాయల అడ్వాన్స్ నగదు మార్పిడి ఎక్కడినుంచి జరిగింది? ఆ డబ్బును ఎవరెవరి ఖాతాలు లేదా ఏ ఏ మార్గాల ద్వారా ముఠా సభ్యులకు చేరవేశారనే దానిపై.. ఇప్పటికే సేకరించిన ఆధారాలు నిందితులను డిఫెన్స్ లో పడేసాయి.
-
చాలా కఠినంగా..
ఈడి చాలా చురుగ్గా కదులుతోంది. కీలక నిందితులైన సునీల్ యాదవ్, ఎర్రి గంగిరెడ్డిల ద్వారా కొంత ఆరా తీసింది. వారు నోరు విప్పడంతో పాటు సుపారి నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను వేళ్ళతో సహా చూపెట్టినట్లు సమాచారం. సునీల్ యాదవ్ సీక్రెట్ స్టేట్మెంట్లు, అప్రూవల్ దస్తగిరి ఇచ్చిన ఆధారాలు ఈడికి బలమైన ఆయుధాలుగా మారాయి.
దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఆధారాలను రాబట్టిన అధికారులు, ఈ కేసులో ఫైనాన్స్ హ్యాండర్లుగా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వారిని విచారణకు పిలిచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక నేరాలను ఛేదించడంలో కఠినంగా ఉండే పి ఎం ఎల్ ఏ చట్టం కింద ఈడీ విచారణ చేపడుతోంది. అందుకే ఈ కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తానికైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి వేస్తున్న అడుగులు నిందితుల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
