-
మంత్రి పొంగులేటి టార్గెట్
-
రెండేళ్ల కిందట కార్యాలయం పై జరిగిన తనిఖీల మాటేంటి
-
గులాబీ పార్టీ నేతల నిలదీత
-
గులాబీ పార్టీ వినూత్న నిరసన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గులాబీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పదేళ్లపాటు తెలంగాణను పాలించిన ఆ పార్టీ వైఫల్యాలను కాంగ్రెస్ బయటపెడుతోంది. అయితే కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని గులాబీ పార్టీ వినూత్న ఆందోళనలకు తెరతీసింది.
తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పాత ఈడీ కేసుల విచారణ ఏమైందంటూ ప్రశ్నిస్తూ ఆందోళన బాట పట్టింది. హైదరాబాదులోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టింది.
రెండేళ్ల కిందట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయాల్లో జరిగిన తనిఖీలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటి అని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేయడం విశేషం.
-
డ్యామేజ్ ను అధిగమించేందుకు..
ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో గులాబీ పార్టీకి డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా కెసిఆర్ ఫ్యామిలీ ఆస్తుల వివరాలను సీఎం రేవంత్ నిండు సభలో వెల్లడించారు. ఆధారాలు, వివరాలతో సహా బయటపెట్టారు. అంతటితో ఆగకుండా కేటీఆర్ తో పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లలో ప్రభుత్వ, అటవీ శాఖ ఆస్తులు ఉన్నాయని కూడా ఆరోపణలు చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫామ్ హౌస్ లపై దండయాత్రలు కూడా చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో గులాబీ పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగింది. అగ్ర నేతలపై అవినీతి మచ్చ మరింత బలపడింది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ వాటిని అధిగమించేందుకు ప్రాజెక్టుల బాట, తాజాగా ఈడి కార్యాలయ బాట చూస్తుంటే ఆ పార్టీ ఫ్రస్టేషన్ ఇట్టే అర్థమయిపోతోంది.
-
రెండేళ్ల కిందట తనిఖీలపై..
రెండేళ్ల కిందట.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయాల లో ఈడి తనిఖీలు చేసింది. అప్పట్లో అది ఒక సంచలనం. అయితే దాని విచారణ ఏమయిందంటూ సోమవారం ఉదయం గులాబీ పార్టీ ఆందోళన బాట పట్టడం విశేషం. ఏకంగా ఈడి కార్యాలయం ఎదుట బైఠాయించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు సంబీర్ పూర్ రాజు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అనుమతితో ఒక ప్రతినిధి బృందం అధికారులను కలిసి వినతి పత్రం కూడా అందించారు. అయినా సరే పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అధికార పక్షానికి ఒక న్యాయమా? విపక్షాలకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు.
-
తీవ్ర చర్చ..
తెలంగాణలో బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర చర్చ నడుస్తోంది. చట్టబద్ధంగా నడిచే కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరులో జోక్యం చేసుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకి ఉండదు. దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఈడికి ఉండదు.
కేవలం రాజకీయంగా ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని ఉద్దేశంతో.. తాము చెప్పినట్టుగా దర్యాప్తు సంస్థలు పనిచేయాలని గులాబీ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తుండడం విచిత్రంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నేతలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ సమయంలో.. దర్యాప్తు సంస్థలను తప్పు పట్టిన గులాబీ నేతలు.. ఇప్పుడు ఏకంగా ఆందోళన బాట పట్టడం మాత్రం సంచలనంగా మారింది.
