హైదరాబాద్ బేగంపేటలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఫరీద్ (20) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను క్యాబ్‌లో తీసుకెళ్లి, తన స్నేహితుడి ఇంట్లో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలోని ఓ సెలూన్‌లో పనిచేసే సమయంలో బాలికకు ఫరీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెను క్యాబ్‌లో తీసుకెళ్లిన అతడు తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఘటనను వీడియో, ఫొటోల రూపంలో చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం ఎవరికైనా చెబితే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను నిందితుడు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బాలిక ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా భయపడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 8న బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు కేసులో తదుపరి చర్యలు చేపడుతున్నారు.
also read: అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో హత్య చేసిన భార్య
