తెలంగాణలో కొత్తగా 41 బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లలో 14 తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో ఉండగా.. మరో 27 బార్లను రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు.
కొత్త బార్ లైసెన్స్ కోసం ఆసక్తి ఉన్నవారు ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష నాన్-రిఫండబుల్ ఫీజుగా చెల్లించాలి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నారు.
లాటరీలో ఎంపికైన తర్వాత నిర్ణీత సమయంలో లైసెన్స్ తీసుకోకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా రూ.5 లక్షల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతాన్ని బట్టి బార్ ఎక్సైజ్ ట్యాక్స్
కొత్తగా ఏర్పాటు చేసే బార్లకు ప్రాంతాన్ని బట్టి వార్షిక బార్ ఎక్సైజ్ ట్యాక్స్ (BET)ను ప్రభుత్వం నిర్ణయించింది. TCUR పరిధిలోని బార్లకు ఏడాదికి రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బోధన్ వంటి కొన్ని ప్రాంతాల్లో రూ.42 లక్షలుగా, మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.30 లక్షలుగా వార్షిక రుసుమును ఖరారు చేశారు.
కొత్తగా మంజూరు చేయనున్న 41 బార్ లైసెన్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.14.62 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో తొలిసారి బార్లు
తాజా నోటిఫికేషన్‌తో దేవరకద్ర, ఎల్లంపల్లి, మద్దూరు, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో తొలిసారిగా బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు చేవెళ్ల, మొయినాబాద్, కొడంగల్, పరిగి, అశ్వరావుపేట, కల్లూరు, మక్తల్, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, ములుగు తదితర ప్రాంతాల్లోనూ కొత్త బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.
ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1,185 బార్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 657 బార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా మరో 41 బార్లకు లైసెన్సులు ఇవ్వడంతో రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య మరింత పెరగనుంది.
also read: లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో ఏసీబీ నిఘాలోకి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఆస్తుల గుట్టు రట్టు
