జార్ఖండ్లో భారీ బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. జమ్షెడ్పూర్లోని గోల్మురి ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్లో గురువారం సాయుధ దుండగులు చొరబడి భారీగా నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
సమాచారం ప్రకారం.. ఐదుగురు సాయుధ వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి అక్కడి సిబ్బందిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం బ్యాంకులో భద్రపరిచిన సుమారు 23 కిలోల బంగారాన్ని అపహరించారు. దాని విలువ దాదాపు రూ.36 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు బ్యాంకులో ఉన్న రూ.43 లక్షల నగదును కూడా దుండగులు తీసుకెళ్లినట్లు సమాచారం.
దోపిడీ అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన భారీ బ్యాంకు దోపిడీల్లో ఇది ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరణకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు ద్వారా వెల్లడించనున్నారు.
also read: ముగ్గురు మైనర్ కుమార్తెలపై తండ్రి లైంగిక వేధింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
