Homeఆంధ్ర ప్రదేశ్విశాఖ సదస్సుకు చంద్రబాబు భారీ ప్లాన్‌...!

విశాఖ సదస్సుకు చంద్రబాబు భారీ ప్లాన్‌…!

  • పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో రోడ్‌షోలు

  • నవంబర్‌ 12, 13న విశాఖలో ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026’

  • ఐదు నగరాల్లో అక్టోబర్‌ 7 నుంచి 26 వరకు రీజినల్‌ కాన్ఫరెన్సులు

  • 30 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనకు సీఎం ఆదేశం

  • పెట్టుబడుల కోసం దేశ, విదేశాల్లో వరుసగా రోడ్‌షోలు.. 21 దేశాల ప్రతినిధుల రాక

అమరావతి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వేటను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. విశాఖపట్నం వేదికగా నవంబర్‌ 12, 13 తేదీల్లో జరగనున్న ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026’ను కేవలం పారిశ్రామిక ఒప్పందాల కార్యక్రమంగా కాకుండా.. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేసే వేదికగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సదస్సుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రీజినల్‌ కాన్ఫరెన్సులు, దేశ విదేశాల్లో చేపడుతున్న రోడ్‌షోలతో పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.

సదస్సుకు ముందే అసలు కసరత్తు…

విశాఖలో ప్రధాన సదస్సు జరిగేలోపే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేలా ఐదు రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నారు. ఒక్కో ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను ఆధారంగా చేసుకుని ఆయా రంగాల్లో పెట్టుబడులను కర్షించడమే వీటి ప్రధాన ఉద్దేశం. అక్టోబర్‌ 7న విశాఖపట్నంలో ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, ఫార్మా, మెడ్‌టెక్‌ రంగాలపై చర్చలు జరగనున్నాయి. అక్టోబర్‌ 12న కాకినాడలో మారిటైమ్‌, షిప్‌ బిల్డింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఆక్వా ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 16న గుంటూరులో గవర్నెన్స్‌, రాజధాని నిర్మాణం, క్వాంటం వ్యాలీ, అర్బన్‌ ఇన్‌ఫ్రా అంశాలు తెరపైకి రానున్నాయి. అక్టోబర్‌ 23న అనంతపురంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఆటోమోటివ్‌, పునరుత్పాదక ఇంధన రంగాలపై దృష్టి పెట్టనున్నారు. అక్టోబర్‌ 26న తిరుపతిలో టూరిజం, ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్‌, స్పేస్‌ టెక్నాలజీ రంగాలను ప్రోత్సహించేలా సమావేశాలు జరగనున్నాయి.

ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రాధాన్యం…

పెట్టుబడులంటే భారీ కంపెనీలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా పెద్దపీట వేయాలని చంద్రబాబు సూచించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందే 30 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ సదస్సుల్లో ‘ఎంఎస్ఎంఈ షోకేస్‌’ ఏర్పాటు చేసి స్థానిక సంస్థలు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మరోవైపు స్టార్టప్‌లకు పెట్టుబడులు సమకూర్చేందుకు ‘షార్క్‌ ట్యాంక్‌’ తరహా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను ప్రాంతీయ సదస్సులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే వ్యాపార ఆలోచనా విధానం పెంపొందించేలా 7వ తరగతి నుంచే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను పాఠ్యాంశాల్లో చేర్చే అంశంపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. ‘ఇన్వెస్ట్‌ కడప’ తరహా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించారు.

పాత ఎంవోయూలపై కూడా ఫోకస్‌…

కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నించడంతో పాటు గతంలో కుదిరిన ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు రూ.22.57 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరినట్లు అధికారులు సీఎం సమీక్షలో వివరించారు. వాటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులు కన్వర్ట్‌ కాగా, 247 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. అక్టోబర్‌ చివరి నాటికి పెండింగ్‌ ప్రతిపాదనల్లో 80 శాతం కన్వర్షన్‌ పూర్తి చేయడంతో పాటు, కన్వర్ట్‌ అయిన ప్రాజెక్టుల్లో 75 శాతం పనులు ప్రారంభించేలా లక్ష్యాలను నిర్దేశించారు.

విశాఖ నుంచి ప్రపంచం దాకా ప్రచారం…

‘ట్రేడ్‌, టెక్నాలజీ, ట్రస్ట్‌, థాట్‌ లీడర్‌షిప్‌’ అనే థీమ్‌తో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు రోడ్‌షోలు కొనసాగుతున్నాయి. దేశీయంగా చెన్నై, బెంగళూరులో ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబైలోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయంగా సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌లలో రోడ్‌షోలు పూర్తయ్యాయి. స్వీడన్‌, జపాన్‌, చైనాలో కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది అంతర్జాతీయ మంత్రులు, 21 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యే షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 8న న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంటే విశాఖలో జరిగే ప్రధాన సదస్సుకు ముందే దేశ, విదేశీ పారిశ్రామిక వర్గాల్లో ఏపీపై ఆసక్తి పెంచేలా ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామం.. సుమలత కార్యవర్గం రద్దు
  2. మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు.. బినామీ ఇంట్లో భారీగా నగదు, విదేశీ కరెన్సీ
  3. కుక్క కాటును నిర్లక్ష్యం చేయడంతో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి
  4.  ఖమ్మంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో 9 నెలల పసికందు మృతి

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు