హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదాన్ని నింపింది. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె. వెంకన్న (57) చికిత్స పొందుతూ కన్నుమూశారు. వరంగల్ జిల్లాకు చెందిన వెంకన్న.. నిమజ్జన బందోబస్తు కోసం హైదరాబాద్కు వచ్చారు.
విధుల్లో ఉండగా ప్రమాదం
గణేశ్ నిమజ్జనం సందర్భంగా వెంకన్నకు ఎన్టీఆర్ గార్డెన్ ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో విధులు కేటాయించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఆయన విధుల్లో ఉండగా ప్రమాదం జరిగింది. సచివాలయం వైపు నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి వెంకన్నను ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఎస్సై రోడ్డుపై పడిపోవడంతో తలకు, కుడి మోకాలికి, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
స్వగ్రామానికి వెళ్లిన తర్వాత ఆరోగ్యం విషమం
ప్రమాదం అనంతరం వెంకన్నను లక్డీకాపూల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్వగ్రామమైన కిష్టాపురానికి బయలుదేరారు.
అయితే గ్రామానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో తలకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే వెంకన్న మృతి చెందారు.
ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం, వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వెంకన్న మృతిపై సీపీ సజ్జనార్ సంతాపం
ఎస్సై వెంకన్న మృతి పట్ల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జన బందోబస్తులో ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
వెంకన్న కుటుంబ సభ్యులకు సీపీ సజ్జనార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో పోలీసు శాఖ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
also read: AP Liquor Scam: రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డికి బెయిల్.. కీలక షరతులు విధించిన ఈడీ కోర్టు
