ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డికి ఊరట లభించింది. వీరిద్దరికీ ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గురువారం దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు నిబంధనలు విధించింది. నిందితులు దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అలాగే కేసులోని సాక్షులను ప్రభావితం చేయడం లేదా దర్యాప్తుకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. బెయిల్ కోసం ఇద్దరూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది.
దర్యాప్తులో ఈడీకి పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణకు హాజరుకావాలని ఈడీ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన అనంతరం శుక్రవారం ఉదయం వీరిద్దరూ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. మద్యం వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తాజాగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
also read: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం!
