Homeఆంధ్ర ప్రదేశ్వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. A1, A3లకు నోటీసులు

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. A1, A3లకు నోటీసులు

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించిన అధికారులు.. తాజాగా కీలక నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, A3గా ఉన్న ఉమాశంకర్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాలని వారికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే కేసులో A2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకు ముందు, తర్వాత చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం.

హత్యకు సంబంధించి భారీ మొత్తంలో డబ్బు సమీకరించారనే ఆరోపణల నేపథ్యంలో.. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్లాయి? ఎలాంటి బ్యాంకు లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

విచారణ సమయంలో సునీల్‌ యాదవ్ తన వ్యక్తిగత ఖాతాలతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను, గత కొంతకాలంగా జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులకు అందించినట్లు సమాచారం. హత్యకు సంబంధించిన వ్యవహారంలో డబ్బు లావాదేవీలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో ఈడీ వాటిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కూడా ఈడీ ఇప్పటికే విచారించింది. తాజాగా A1, A3లకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లయింది.

వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే విచారణల్లో ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

also read: లంచం డిమాండ్ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లోనే విషం తాగిన యువకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు