క్రైమ్ మిర్రర్ : పోలీసులు లంచం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లోనే విషపదార్థం తాగిన ఘటన పంజాబ్‌లోని బర్నాలాలో కలకలం రేపింది. జోబన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు ఈ ఘటనకు ముందు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న జోబన్‌ప్రీత్ సింగ్‌కు చెందిన కారుకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పోలీసు రిపోర్టు కాపీ కోసం ఆయన గురువారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే రిపోర్టు కాపీ తీసుకునే విషయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తనను లంచం కోసం ఇబ్బంది పెడుతున్నారని జోబన్‌ప్రీత్ ఆరోపించాడు.
గత రెండు వారాలుగా రిపోర్టు కాపీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని వీడియోలో పేర్కొన్నాడు. ఇక చేసేదేమీ లేక విషం తాగుతున్నానని చెప్పి ఆ చర్యకు పాల్పడ్డాడు. అనంతరం అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం ప్రస్తుతం అతడు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. జోబన్‌ప్రీత్ సింగ్ తీసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో ఈ ఘటనపై రాజకీయ దుమారం మొదలైంది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, జవాబుదారీతనం అంశాలపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావాతో పాటు శిరోమణి అకాలీ దళ్ నేతలు డిమాండ్ చేశారు. అయితే యువకుడు చేసిన లంచం ఆరోపణలను పోలీసులు ఖండించారు. జోబన్‌ప్రీత్ చెప్పిన కారణాల వల్లే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నిర్ధారించడం సరికాదని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల వివరణ ఇదీ..
జోబన్‌ప్రీత్ కుటుంబంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయని, అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. కారు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టు కాపీ తీసుకునేందుకు అతను పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు వెల్లడించారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, తనను కలవాల్సి ఉందని జోబన్‌ప్రీత్ చెప్పడంతో కొంత సమయం వేచి ఉండాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఇంతలోనే అతను విషపదార్థం తాగినట్లు పేర్కొన్నారు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించామని, వైద్య చికిత్స అనంతరం ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వెల్లడించారు. రిపోర్టు కాపీ ఇవ్వకుండా వేధించడంతోనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్న ఆరోపణలను వారు తోసిపుచ్చారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. యువకుడి ఆరోపణలు, పోలీసుల వివరణతో ఈ వ్యవహారం ప్రస్తుతం పంజాబ్‌లో చర్చనీయాంశంగా మారింది.
