ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో బయటపడుతున్నాయి. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఏఐ టూల్స్‌ను ఆశ్రయించడం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ అతిపెద్ద సాంకేతిక విప్లవం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా సామ్(19) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అతని తల్లి లీలా టర్నర్.. చాట్‌జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ఏఐపై కోర్టులో దావా వేశారు.సామ్ తన దైనందిన జీవితంలో ప్రతి చిన్న విషయానికీ చాట్‌జీపీటీ పైనే ఎక్కువగా ఆధారపడేవాడని అతని తల్లి లీలా టర్నర్ తెలిపారు. అయితే, అనారోగ్య సమస్యల విషయంలో డాక్టర్‌ను సంప్రదించకుండా ఏఐను నమ్మడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న సామ్, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు, అలాగే ఆందోళన (యాంగ్జైటీ) తగ్గించే మందులను కలిపి వాడొచ్చా అని చాట్‌జీపీటీని అడిగాడు. దానికి ఆ ఏఐ టూల్ స్పందిస్తూ.. ఆ రెండు మందులను ఎలాంటి ఇబ్బందీ లేకుండా కలిపి వాడొచ్చని తప్పుడు సూచనలు చేసింది. ఏఐ చెప్పిన మాటలను పూర్తిగా నమ్మేసిన ఆ యువకుడు, ఆ మందులను ఒకేసారి తీసుకోవడంతో తీవ్ర దుష్ప్రభావాలకు గురై మృతి చెందాడు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ – జనసేన వాటా ఎంత?
ఈ ఘటనపై లీలా టర్నర్ ఓపెన్ఏఐ సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. యూజర్లను ఎంగేజ్ చేసేలా, వారు అడిగిన ప్రతిదానికీ ‘కరెక్ట్’ అని సమాధానం చెప్పేలా ఆ ప్లాట్‌ఫామ్‌ను మార్చారని ఆమె ఆరోపించారు. సామ్ అడిగిన ప్రశ్నలకు కూడా, కేవలం యూజర్‌ను తన ప్లాట్‌ఫామ్ పై ఉంచుకోవడం కోసమే చాట్‌జీపీటీ సరైన వైద్య నిబంధనలను పరిశీలించకుండా కరెక్ట్ అని తప్పుడు సలహా ఇచ్చిందని ఆమె మండిపడ్డారు. చాట్‌జీపీటీ చేసిన ఈ ఘోరమైన తప్పిదం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని ఆమె పేర్కొన్నారు.వైద్యపరమైన, అత్యవసరమైన విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. టెక్నాలజీని కేవలం సమాచారం కోసం మాత్రమే వాడుకోవాలని, ప్రాణాలతో చెలగాటమాడే వైద్య సలహాల కోసం కాదని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. ఏఐ సంస్థలు కూడా తమ టూల్స్ ఇచ్చే సమాచారం పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
