మహారాష్ట్రలోని పుణె జిల్లాలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోహగఢ్ కోటపై నుంచి కిందపడి కేతన్ మృతి చెందిన ఘటన ప్రమాదవశాత్తు జరిగినది కాదని.. పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పుణె రూరల్ పోలీసులు వడ్గావ్ మావల్ కోర్టులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో సేకరించిన పలు కీలక ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.
సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, వాట్సాప్ చాట్స్, మొబైల్ ఫోన్ వివరాలు, కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు సుమారు 80 నుంచి 85 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటి ఆధారంగా కేతన్ మృతిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 14న కేతన్‌ను కొండపై నుంచి తోసేందుకు ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ప్రయత్నం విఫలమైన అనంతరం జూన్ 18న మరోసారి ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రెండో ఘటనలోనే కేతన్ లోహగఢ్ కోటపై నుంచి కిందపడినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
కేసుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్, ప్రత్యక్ష సాక్ష్యాలను సమీకరించిన పోలీసులు.. కేతన్ మృతి ప్రమాదం కాదని, హత్యేనని తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
also read: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన.. మృతదేహం కంటిని కొరికిన ఎలుకలు!
