‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషితో కలిసి ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో ఈ సినిమా అక్టోబర్ 2, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
అసలు కథ ఏంటి?
‘పూజా మేరీ జాన్’లో మృణాల్ ఠాకూర్ ‘పూజ’ అనే యువతి పాత్రలో కనిపించనున్నారు. ఆమె ప్రియుడు అనికేత్ మరణం చుట్టూ కథ సాగుతుంది. ఆ మరణానికి పూజ కారణమనే ఆరోపణలు రావడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది.
పూజకు స్నేహితురాలిగా, లాయర్‌గా హుమా ఖురేషి ‘సనా’ పాత్రలో నటించారు. ఒకవైపు స్నేహితురాలికి అండగా నిలవాలా.. మరోవైపు తనకు ఎంతో సన్నిహితమైన అనికేత్ మరణం వెనుక అసలు నిజాన్ని తెలుసుకోవాలా అనే సందిగ్ధంలో సనా చిక్కుకుంటుంది.
అనుమానాలు, ఆరోపణలు, వ్యక్తిగత భావోద్వేగాల మధ్య పాత్రలు ఎదుర్కొనే సంఘర్షణే ఈ కథకు ప్రధాన బలం కానుంది. వాస్తవం ఏంటి? ఊహ ఏంటి? అనే విషయాల మధ్య ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా సినిమా సాగుతుందని చిత్రబృందం వెల్లడించింది.
ప్రముఖ తారాగణం
మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించారు. విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది.
ఇక సినిమా కథపై ఆసక్తిని పెంచేలా జీ5 కూడా ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రేక్షకులు తెరపై చూసే విషయాలనే కాకుండా, తాము నమ్ముతున్న విషయాలను కూడా ప్రశ్నించేలా ఈ కథ ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌పై ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 2న జీ5లో ‘పూజా మేరీ జాన్’ స్ట్రీమింగ్ కానుండటంతో.. ఈ నాలుగేళ్లుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
also read: తాడేపల్లిగూడెంలో విషాదం.. వినాయక నిమజ్జన ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
