తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో కారు స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా డీజే సౌండ్‌తో పాటు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. పాటలకు పలువురు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా.. ఎల్.అగ్రహారంలోని టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కాకర్లమూడి ఏసు (48) కూడా తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు.
కొద్దిసేపటి తర్వాత ఏసు అకస్మాత్తుగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఏసు మృతికి డీజే సౌండ్ కారణమా? లేక ఇతర కారణాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారా? అనే విషయం ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. వైద్య నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఏసు మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. వినాయక నిమజ్జన వేడుకల్లో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
also read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026.. సేల్ ఎప్పటి నుంచి అంటే?
