క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అజాంగఢ్ జిల్లా ఫుల్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్‌పూర్ గ్రామ సమీపంలో ఉదయం సుమారు 5 గంటల సమయంలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఫుల్పుర్ ప్రాంతంలోని రాజ్‌భార్ గణేష్ మండపంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తొమ్మిది మంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వారంతా కారులో సరాయ్ మీర్ ప్రాంతానికి బయలుదేరారు. జగదీష్‌పూర్ సమీపంలోకి చేరుకున్న సమయంలో కారు వేగం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మొత్తం తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఆరుగురిని తీవ్ర గాయాలతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వారిని కారులో నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో విషాదకర వాతావరణం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ సపరేట్…!
