క్రైమ్ మిర్రర్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. నోటీసుల ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తునకు సహకరించాలని మహేందర్‌రెడ్డి, మహేశ్‌లను పోలీసులు కోరారు. అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనపై నమోదైన కేసులో వీరిద్దరినీ నిందితులుగా పేర్కొంటూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కేసు నమోదు అనంతరం మహేందర్‌రెడ్డి, మహేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను అనుసరించి పోలీసులు తాజాగా ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత సమయానికి పోలీస్‌స్టేషన్‌లో హాజరై విచారణకు సహకరించాలని అందులో పేర్కొన్నారు. అయితే పండుగ రోజునే పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
also read : సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు.. ముగ్గురు ముసుగు దుండగుల హల్‌చల్
