క్రైమ్ మిర్రర్ : నగరంలోని కోకాపేటలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన తొమ్మిది మంది మైనర్లు.. అనంతరం సరదాగా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగా వారి ప్రయాణం విషాదాంతమైంది. నియోపోలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు తమ స్నేహితుడు తమన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా పార్టీకి వెళ్లారు. వేడుకలు ముగిసిన అనంతరం తొమ్మిది మంది కలిసి ఇన్నోవా క్రిస్టా వాహనంలో లాంగ్ డ్రైవ్ కోసం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లారు. కోకాపేటలోని నియోపోలిస్ సమీపంలోకి చేరుకోగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులకు కూడా గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వాహనం వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకల్లో ఆనందంగా గడిపిన విద్యార్థులు అనంతరం లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి ప్రమాదానికి గురికావడంతో విషాదం నెలకొంది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు.. ముగ్గురు ముసుగు దుండగుల హల్చల్
