HomeUncategorizedసింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు.. ముగ్గురు ముసుగు దుండగుల హల్‌చల్

సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు.. ముగ్గురు ముసుగు దుండగుల హల్‌చల్

క్రైమ్ మిర్రర్ : పంజాబ్‌లో గన్‌ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో గాయకుడి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. బర్నాలా జిల్లాలోని ఫర్వాహి గ్రామంలో పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు నివాసం వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి గులాబ్ సిద్ధు ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిలో ఇద్దరు తుపాకులతో ఇంటివైపు కాల్పులు జరపగా, మూడో వ్యక్తి బైక్‌ను నడిపినట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో ఘటనను మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించేందుకు కూడా వారు ప్రయత్నించినట్లు సమాచారం. దుండగులు సుమారు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి గేటుతో పాటు సమీప ప్రాంతాల్లో బుల్లెట్ల ఆనవాళ్లు లభించాయి. కాల్పులు జరిగిన సమయంలో గులాబ్ సిద్ధు ఇంట్లో లేకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

కాల్పుల విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌ ఆనవాళ్లను పరిశీలించడంతో పాటు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. దుండగుల కదలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితమే గులాబ్ సిద్ధుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనను హత్య చేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

సింగర్లే టార్గెట్‌గా..?

గులాబ్ సిద్ధుకు గతంలో హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మూసేవాలా కూడా కాల్పుల ఘటనలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఇటీవల పలువురు గాయకులు, కళాకారులకు బెదిరింపులు రావడం, కొందరి ఇళ్ల వద్ద కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తాజా ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు.
also read : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు