Homeక్రైమ్యూట్యూబర్ నందనకు మరోసారి పోలీసుల నోటీసులు... లండన్ ఉద్యోగం పేరుతో రూ.10.50 లక్షలు మోసం చేశారంటూ...

యూట్యూబర్ నందనకు మరోసారి పోలీసుల నోటీసులు… లండన్ ఉద్యోగం పేరుతో రూ.10.50 లక్షలు మోసం చేశారంటూ ఫిర్యాదు

ప్రముఖ యూట్యూబర్ నందనకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ పేరుతో ఛానల్ నిర్వహిస్తున్న నందన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.

తన కోడలికి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నందన హామీ ఇచ్చారని, ఈ నమ్మకంతో ఆమెకు విడతలవారీగా మొత్తం రూ.10.50 లక్షలు చెల్లించినట్లు శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో పలువురికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించినట్లు నందన చెప్పడంతో ఆమెను నమ్మి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు.

అయితే డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా, ఈ ఏడాది జులై 4న నందనపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా, నందనపై ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఆమెపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ కావడంతో ఇటీవల హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తనపై వచ్చిన ఆరోపణలతో తనకు సంబంధం లేదని నందన విచారణ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాలను తన భర్తే చూసుకుంటారని ఆమె పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా పోలీసులు నమోదైన కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందనను ఈ నెల 17న విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.

also read: లైంగిక వేధింపుల కేసులో ‘ఢీ-10’ విజేత రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు