Homeక్రైమ్సెలవు రోజు విషాదం.. కాలువలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

సెలవు రోజు విషాదం.. కాలువలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

క్రైమ్ మిర్రర్ : సెలవు రోజును స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలనుకున్న ఇద్దరు విద్యార్థులకు అదే రోజు విషాదంగా మారింది. ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు నీటిలో గల్లంతై మృతి చెందారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రెండో శనివారం సెలవు కావడంతో కోదాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన సాధిక హరీష్ నాయుడు (14), గుడిబండ గ్రామానికి చెందిన ఎలమర్తి స్వరూప్ రెడ్డి (14) ముకుందాపురానికి వచ్చారు. తమ తోటి విద్యార్థి, స్నేహితుడు అనుదీప్‌ను కలిసిన అనంతరం ముగ్గురూ కలిసి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారు.

అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపిన అనంతరం ముగ్గురూ కాలువలో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే అనుకోని విధంగా నీటి ప్రవాహంలో హరీష్ నాయుడు, స్వరూప్ రెడ్డి అదుపుతప్పి గల్లంతయ్యారు. మరో విద్యార్థి అనుదీప్‌ను స్థానికులు గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇద్దరు విద్యార్థులు కనిపించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. కాలువలో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

విద్యార్థుల ఆచూకీ కోసం కాలువలో నీటి మట్టాన్ని తగ్గిస్తూ గాలింపు చేపట్టారు. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం హరీష్ నాయుడు, స్వరూప్ రెడ్డి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు స్వరూప్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మునగాల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.

ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లి

మృతుల్లో ఒకరైన సాధిక హరీష్ నాయుడు కోదాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన సాధిక కళ్యాణి కుమారుడు. హరీష్ ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సుమారు రెండేళ్ల క్రితం హరీష్ తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన కొద్దికాలానికే తన ఒక్కగానొక్క కుమారుడిని కూడా కోల్పోవడంతో కళ్యాణి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమారుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.
also read : రోడ్డు ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ అధికారి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు