-
వల్లభనేని వంశీ మోహన్ కు రూ.10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ ప్రకటన
-
గన్నవరం మట్టి గ్రావెల్ ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో నోరు జారిన మాజీ మంత్రి
-
రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి కొడాలి నాని సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తన మిత్రుడు వల్లభనేని వంశీ మోహన్ ను ఇరికించారు. కేవలం ఒకే ఒక ప్రకటనతో కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అక్రమ గ్రావెల్ మైనింగ్, ఇళ్ల పట్టాల విక్రయ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆ అంశంపై మాట్లాడారు మాజీ మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ మోహన్ కు హైదరాబాద్ నగరంలోనే 200 ఎకరాల భూమి ఉంది అని.. దాని మార్కెట్ విలువ పదివేల కోట్ల రూపాయల పై మాటే అని.. అంతటి మహా కుబేరుడు ఎక్కడకు వచ్చి గ్రావెల్ అమ్ముకుంటాడా? పేదల ఇళ్ల పట్టాలు కుట్టేస్తాడు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. పక్కనే ఉన్న వంశి ఖండించకపోగా.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.
-
కేసులు చుట్టుముట్టే అవకాశం..
కానీ ఈ చిన్న పాయింట్ తో కూటమి ప్రభుత్వం కేసులతో పట్టు బిగించే అవకాశం ఉంది. కొడాలి నాని చెప్పిన వంశి ఆస్తుల విలువ పదివేల కోట్ల రూపాయలు ఉంటే.. ఆ కేసు అదే వంశీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. కొడాలి నాని చెబుతున్నట్టు వల్లభనేని వంశీ మోహన్ కు 10000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉందా? ఉంటే ఎవరి పేరు మీద ఉంది? బినామీల పేరుతో ఉందా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా వల్లభనేని వంశీ మోహన్ కు అంతలా ఆస్తులు ఉంటే.. మొన్నటి ఎన్నికల్లో తన నామినేషన్ ఆవిడవిట్ లో ఎందుకు ఈ విషయాన్ని దాచారు? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.
-
చిన్న విషయం కాదు..
తన మిత్రుడైన మాజీ ఎమ్మెల్యే ఆస్తుల గురించి.. మరో బాధ్యతాయుతమైన మాజీమంత్రి బహిరంగంగా ప్రకటన చేయడం చిన్న విషయం కాదు. కేవలం వంశీ మోహన్ కె అంతలా ఆస్తి ఉంటే.. మరి కొడాలి నాని కి ఏ స్థాయిలో ఆస్తులు ఉంటాయో? అనే చర్చ కొనసాగుతోంది. అయితే ఈ పరిణామం కేవలం ఒక రాజకీయ ప్రకటనతో ఆగిపోయేలా లేదు.
చట్టబద్ధంగా సమర్పించిన అఫీడవిట్ కు, బహిరంగంగా ప్రకటించిన ఆస్తికి మధ్య ఉన్న వేలకోట్ల వ్యత్యాసం పై.. కేంద్ర ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించడం ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం తీవ్రమైన నేరం.
లెక్కల్లో చూపని పదివేల కోట్ల బినామీ నెట్వర్క్ పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ జరిపేందుకు నాని వ్యాఖ్యలే ప్రధాన ఆధారంగా మారనున్నాయి. స్నేహితుడిని వెనుకేసుకొచ్చే అత్యుత్సాహంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇద్దరు నేతలను ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థల ముందు నిలబెట్టే పరిస్థితి కల్పించాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
