-
ఆర్మీ ఆయుధాల చోరీ ఘటనలో అనుమానాలు ఎన్నో
-
రిటైర్డ్ హవల్దార్ అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ ఆర్మీ క్యాంపస్ లో ఆయుధాల చోరీ కేసును ఛేదించారు విచారణ అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఓ రిటైర్డ్ హవల్దార్ ను అరెస్టు చేశారు. ఆయుధాలను రికవరీ చేశారు. ఆయన ఒక్కడినే నిందితుడిగా చూపారు.
అయితే ఆ ఒక్కడు నేరం చేయగలరా అన్నది ఇప్పుడు అందరిలోనూ సందేహం. అంత పెద్ద ఆర్మీ క్యాంపులోకి ఇతరులు పొరపాటున కూడా అడుగుపెట్టలేరు. అటువంటి చోట చోరీ జరిగింది. అయితే ఈ చోరీ ఒక్కరితోనే సాధ్యమయ్యేది కాదు అనేది ఒక అనుమానం. అందరిలోనూ ఇదే అనుమానం మెలుగుతోంది.
-
ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ..
ఆర్మీ ఆయుధాల చోరీ ఘటనకు సంబంధించి రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ మల్లేష్ అలియాస్ రాజును అరెస్టు చేశారు. అతని వద్ద దొంగిలించిన ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి డిజిపి కీలక విషయాలను వెల్లడించారు. మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించి.. అక్కడ సిసిటీవీల కవరేజ్, లైటింగ్ లోపాలను గుర్తించి సైనిక స్థావరం లోపలికి ప్రవేశించాడు అనేది విచారణ అధికారులు చెబుతున్న మాట.
హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధాల గది తాళాలను పగులుగొట్టి నాలుగు ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు 9 ఎం ఎం పిస్టోళ్లు, మరో సివిలియన్ పిస్టల్, నైట్ విజన్ బైనాక్యులర్ తో పాటు సుమారు 750 కి పైగా లైవ్ బుల్లెట్లను దొంగిలించాడు. తొలిత మోటార్ సైకిల్ పై రెండు కిలోమీటర్ల మేర తీసుకెళ్లి.. ఆలయం వద్ద దాచి పెట్టి.. తెల్లవారుజామున బాలాజీ నగర్ లోని ఇంటి నుంచి తెల్లటి బ్రేజా కారును తెచ్చి ఆయుధాలను మార్చినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు.
-
కొంతమంది అధికారుల పాత్ర..
పోలీసుల కళ్ళు గప్పే క్రమంలో.. ఈ పని ఒక్కరితో జరిగేది కాదు అని.. ఇంకా చాలామంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే ఆర్మీ విషయం కాబట్టి చాలా విషయాలు దాచిపెట్టి.. అంతర్గతంగా వారు విచారణ చేసుకుంటారని.. రిటైర్డ్ అధికారిని మాత్రం నిందితుడిగా చూపించినట్లు ఎక్కువమంది భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఇంటి దొంగలపైనే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశ భద్రత, గూఢచర్యం, డ్రగ్స్ మాఫియా కోణాల్లోనూ దర్యాప్తు జరిగింది.
ఇటీవల విట్టారైన ఇద్దరిపై దృష్టి సారించగా.. మల్లేష్ కదిలికలు అనుమానాస్పదంగా మారాయి. కుటుంబ సభ్యుల సమక్షంలోనే విచారించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ ఒక్కరితో జరిగే పని కాదు అని.. ఇందులో మరికొందరి ప్రమేయం ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
