-
అక్టోబర్ 3 లేదా 4న నోటిఫికేషన్
-
15 రోజుల్లోనే పూర్తికానున్న ప్రక్రియ
-
రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుందా? ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందా? ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? తరువాత జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా? చివరిగా పంచాయితీ ఎన్నికలు ఉంటాయా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. అయితే తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 3 లేదా 4వ తేదీన కచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది.
-
కొద్దిరోజుల కిందట సన్నాహాలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా రోజులుగా సన్నాహాలు మొదలుపెట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆ కేంద్రాల్లో మౌలిక వసతులు, సమగ్ర ఓటర్ల జాబితా ప్రదర్శన, భద్రతాపరమైన అంశాలు.. ఇలా అన్నింటి పైన పూర్తిగా కసరత్తు పూర్తి చేసింది ఎన్నికల సంఘం.
కానీ ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టులో కేసులు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే కొత్త ఓటర్ల జాబితాను తీసుకొని.. ఎన్నికలు నిర్వహించాలని చాలామంది పిటిషన్లు దాఖలు చేశారు కోర్టుల్లో.
అయితే ఈ మొత్తం కేసులు ఈ నెల చివరి నాటికి ఒక కొలిక్కి వస్తాయి. అందుకే అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది.
-
18న పోలింగ్..
మున్సిపల్ ఎన్నికలను 15 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ వరుసగా తొలి వారంలోనే జరిగిపోతాయి.
ఆ తరువాత మలివారం ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో పోలింగ్ ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా మున్సిపాలిటీలు.. 17 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి.
మున్సిపల్ చట్టాల సవరణ ప్రకారం ఈసారి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్ పర్సన్ పదవులను మాత్రం పరోక్ష పద్ధతిలో భర్తీచేస్తారు.
-
కొత్త పింఛన్లతో..
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అక్టోబర్ 4న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. దాదాపు 3 లక్షల వరకు కొత్త పింఛన్లు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ ఈ నెలలోనే పూర్తి చేసి.. అర్హులను ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 1న కొత్త పింఛన్ల జారీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో సెలవు దినం. అందుకే మూడో తేదీ కానీ.. నాలుగో తేదీ కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది.
