-
స్టార్ హీరోలు, డైరెక్టర్లకు సర్ నోటీసులు
-
స్పోర్ట్స్, బిజినెస్ సెలబ్రిటీలకు సైతం..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైదరాబాదులో సినీ, స్పోర్ట్స్, వ్యాపార రంగాల ప్రముఖులకు షాక్ తగిలింది. ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పలువురికి నోటీసులు అందించింది. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన అనంతరం పెద్ద ఎత్తున నోటీసులు జారీ అయ్యాయి.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గాల పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటర్లుగా నమోదయ్యారు. అయితే తాజా సర్వేలో చాలామంది వివరాల్లో సాంకేతిక లోపాలు, వ్యత్యాసాలు బయటపడడంతో ఎన్నికల అధికారులు చట్టబద్ధంగా వివరణ నోటీసులు పంపారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
-
చాలామంది ప్రముఖులకు..
ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి తారలు, దిగ్గజ దర్శకులు ఉన్నారు. జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, మరోవైపు దగ్గుబాటి వెంకటేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ కథనాయక సుమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ పేర్లు కూడా ఎన్నికల సంఘం నోటీసుల జాబితాలో ఉన్నాయి. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాదు ఇతర రంగాల సెలబ్రిటీస్ సైతం ఈ జాబితాలో ఉన్నారు.
-
వివిధ తప్పిదాలతో..
ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, మీథాలి రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ జాబితాలో ఉండడం విశేషం. ప్రముఖ ఫార్మా దిగ్గజం, దివిస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి ప్రముఖులు సైతం నోటీసులు అందుకున్నారు.
వాటర్ కార్డులో వ్యక్తిగత పేర్లు, ఇంటి పేర్లు సరిపోకపోవడం, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాలు, గత ఎస్ ఐ ఆర్ రికార్డులతో ఆధార్, ప్రస్తుత చిరునామా వివరాలు మ్యాపింగ్ కాకపోవడం వంటి సాంకేతిక కారణాలవల్లే.. ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే వీరంతా సెలబ్రిటీలు కావడంతో ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాకపోతే.. తమ తరుపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలతో విచారణకు హాజరై వివరాలను సరి చేసుకుంటే ఓటు హక్కు సురక్షితమే.
