Homeతెలంగాణఆ ఇద్దరితో బిఆర్ఎస్ రాజకీయం...!

ఆ ఇద్దరితో బిఆర్ఎస్ రాజకీయం…!

  • జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి

  • అసెంబ్లీ గేటు ఎదుట పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు

  • హుందాతనానికి తగదు అంటున్న విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగించిన దళిత ఆత్మగౌరవ కార్డుకు పోటీగా.. గులాబీ పార్టీ కౌంటర్ రాజకీయం ప్రారంభించింది. అది కూడా ఇద్దరు మహిళా నేతలతో. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గేటు వద్ద తమను పోలీసులు అవమానించారంటూ.. భౌతిక దాడులకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ తలుపు తట్టారు. అయితే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అత్యున్నత హోదాల్లో వెలిగిన ఆ సీనియర్ మహిళా నేతలు.. ప్రస్తుత రాజకీయాలు చేస్తున్న తీరు వారి స్థాయిని, స్థానానికి తగ్గినట్టు లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

  • అనుకోని రీతిలోనే..

ఈ మహిళా మాజీ మంత్రులు ఇద్దరు అనుకొని రీతిలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబంలో జరిగిన కొన్ని దురదృష్టకర ఘటనలతోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. పదవులను పొందారు. రాజకీయంగా అత్యున్నత ప్రాధాన్యతను కూడా పొందగలిగారు. దేశంలోనే తొలి మహిళ హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా బాధ్యతలు స్వీకరించారు. సునీత లక్ష్మారెడ్డి కూడా అత్యున్నత శాఖలు కట్టబెట్టి అగ్ర పీఠాన నిలబెట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చిన ఆ గుర్తింపు తోనే వారు రాష్ట్ర రాజకీయంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన, గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అయితే రాజకీయ కారణాలతో అదే కాంగ్రెస్ ను విభేదించి గులాబీ పార్టీలో చేరిపోయారు.

  • అభ్యంతరకర విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన వారు.. అదే కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పై వారు చేస్తున్న విమర్శలు, ఎంచుకుంటున్న నిరసన మార్గాలు ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీపై, తమను రాజకీయంగా తీర్చిదిద్దిన వేదికపై తీవ్ర స్థాయిలో వారు ఆరోపణలు చేస్తున్నారు. గులాబీ పార్టీ రాజకీయానికి వారు పావులుగా మారుతుండడం మాత్రం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం ప్రతిపక్షాల బాధ్యత. కానీ దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు అనుసరిస్తున్న తీరు మాత్రం వారి ఇమేజ్ను డామేజ్ చేసేలా ఉంది. తమ వ్యక్తిగత గౌరవాన్ని, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పణంగా పెడుతున్న ఆ ఇద్దరు మహిళా నేతలపై కొత్తగా చర్చ సాగుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు