-
ఏటా గణేష్ నవరాత్రుల్లో మౌనవ్రతం
-
ఈ ఏడాది పదవిపోవడంతో ముందుగానే..
-
నెలరోజుల తరువాతే రాజకీయ నిర్ణయం?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కొండా సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని ఆమె ఎందుకు చెప్పారు? మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆమె ఎందుకు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు? వారి భవిష్యత్తు రాజకీయం ఏంటి? ఇప్పుడు క్యాడర్లోను, కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే చర్చ.
ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు ముగిసే వరకు కొండా దంపతులు అజ్ఞాతంలో ఉంటారు. ఇది చాలా కాలంగా కొండా ఫ్యామిలీకి ఉన్న ఆనవాయితీ. వినాయక నవరాత్రులను తమకు సంబంధించిన ఏ పనులు చేయడానికి, ఎవరితోనూ మాట్లాడడానికి కొండా దంపతులు ఆసక్తి చూపరు. వీరికి ప్రతి సంవత్సరం ఇదొక సెంటిమెంట్. అందుకే ఆమె ఎటువంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
-
పొలిటికల్ కెరీర్ పై విస్తృత చర్చ..
మంత్రివర్గం నుంచి తొలగింపు అనంతరం కొండా సురేఖ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ పై విస్తృత చర్చ ప్రారంభం అయింది. కానీ ఇప్పట్లో కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
వినాయక నవరాత్రుల అనంతరం తమ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన సంకేతాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆమె బిజెపిలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించిన అనంతరం ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది.
-
బసవరాజు సారయ్య యాక్టివ్..
వరంగల్ తూర్పు లో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చాలా యాక్టివ్ అవుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతలు సారయ్యను అనుసరిస్తున్నారు. అదే సమయంలో సారయ్య సైతం కాంగ్రెస్ నేతలను సాదరంగా ఆహ్వానించి తన వర్గంలో చేరాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ వర్గం నుంచి కొంతమంది చేజారిపోయినట్లు ప్రచారం నడుస్తోంది.
ఇంకా రెండేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. అనవసర వివాదాలు అవసరమా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ సుస్మిత పటేల్ బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. పైగా రాజకీయ స్థిరత్వం లేని కొండా దంపతులతో కలిసి నడిచేందుకు చాలా మంది నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వినాయక నవరాత్రులు అనంతరం కొండా దంపతులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది.
