రాజస్థాన్లోని ఝాలావాడ్ జిల్లాలో ఓ ఆలయ చోరీ ఘటనకు ఊహించని ముగింపు లభించింది. రెండున్నరేళ్ల క్రితం నరసింహ స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి.. తాజాగా తాను దొంగిలించిన విలువైన వస్తువులన్నింటినీ తిరిగి ఆలయంలోనే వదిలి వెళ్లాడు. అంతేకాదు, తన తప్పును క్షమించాలని కోరుతూ ఓ లేఖను కూడా అక్కడ ఉంచాడు.
ఝాలావాడ్ జిల్లా బకానీ పరిధిలోని నరసింహ స్వామి ఆలయంలో కొన్నేళ్ల క్రితం చోరీ జరిగింది. ఆ సమయంలో ఆలయంలోని మూడు వెండి కిరీటాలు, వెండి గొడుగు, సుమారు 400 గ్రాముల ఇతర వెండి ఆభరణాలు, ఇత్తడి సింహాసనం, హారతి సామగ్రిని దొంగ ఎత్తుకెళ్లాడు.
అయితే ఇంతకాలం తర్వాత తాజాగా ఓ సంచిలో ఆ వస్తువులన్నింటినీ పెట్టి దొంగ ఆలయంలోనే వదిలి వెళ్లాడు. సంచిలో ఆభరణాలతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. తాను మద్యం మత్తులో తెలియక తప్పు చేశానని, తనను క్షమించాలని లేఖలో దొంగ వేడుకున్నాడు.
దొంగిలించిన ఆభరణాలకు ఏదైనా నష్టం జరిగి ఉంటే వాటిని మరమ్మతులు చేయించేందుకు అవసరమైన ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కూడా సంచిలో పెట్టినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన ఆలయ నిర్వాహకులు, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండున్నరేళ్ల క్రితం జరిగిన చోరీకి సంబంధించిన వస్తువులు తిరిగి లభించడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఇంతకాలం తర్వాత దొంగ తన తప్పును అంగీకరించి చోరీ చేసిన వస్తువులను తిరిగి అప్పగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
also read: అంజయ్య నగర్లో వంట మనిషి దారుణ హత్య
