కన్నడ మాధ్యమ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో ఓ ఉపాధ్యాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తన డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా రక్తంతో లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
శివమొగ్గ జిల్లా శికారిపురలోని సాలేశ్వర విద్యా సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రశాంత్ ఈ నిరసనకు దిగారు. 1995 తర్వాత ప్రారంభమైన కన్నడ మాధ్యమ పాఠశాలలను కూడా గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తన చేతి నుంచి సిరంజి ద్వారా రక్తాన్ని తీసుకున్న ప్రశాంత్.. అనంతరం ఆ రక్తాన్ని కాగితంపై ఉపయోగించి తన డిమాండ్లను లేఖ రూపంలో రాశారు. ఈ లేఖను కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పకు అందజేయనున్నట్లు తెలిపారు.
తమ విద్యాసంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, దీంతో పాఠశాలను కొనసాగించడం కూడా కష్టంగా మారిందని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఇలాంటి విద్యాసంస్థలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సాలేశ్వర విద్యా సంస్థ మూడు దశాబ్దాలకు పైగా విద్యాసేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. గతంలో గ్రాంట్ కోసం పాఠశాలను పరిశీలించిన సమయంలో నిర్ణీత గడువుకు కేవలం ఒక్క రోజు తక్కువగా ఉండటంతో అర్హత సాధించలేకపోయామని పేర్కొన్నారు.
1995 తర్వాత ప్రారంభమైన అన్ని కన్నడ మాధ్యమ పాఠశాలలను గ్రాంట్-ఇన్-ఎయిడ్ పథకంలోకి తీసుకురావడంతో పాటు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
also read: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపు.. ఇద్దరు నిందితుల కస్టడీ కోరిన సిట్
