ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యాపారి హత్య కేసు కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంతో విసిగిపోయిన కోడలు.. మామను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినీత్ మనోచా అనే 60 ఏళ్ల వ్యక్తి కాన్పూర్‌లో ఔషధ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల కదలికలను గమనించేవారని సమాచారం. ఈ విషయంలో కోడలు శాలుకు, మామకు మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో గతంలో తమ ఇంట్లో పనిచేసిన గౌతమ్‌తో శాలు పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మామను హత్య చేయాలని ఇద్దరూ కలిసి పథకం వేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 5న పార్టీకి వెళ్తున్నామని చెప్పి శాలు తన భర్త, బిడ్డతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో గౌతమ్ తన స్నేహితుడు కిషోర్‌తో కలిసి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వినీత్ మనోచాపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు శాలు ఫోన్‌లోని రికార్డింగ్స్‌ను కూడా విశ్లేషించారు. వాటి ఆధారంగా హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో శాలు, గౌతమ్, కిషోర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: సంగారెడ్డిలో విషాదం.. స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి
