క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఓఖ్లా ఫేజ్-1 ప్రాంతంలోని ఓ కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో కమ్యూనిటీ హాల్‌లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి అక్కడ ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
ఘటనకు సంబంధించి ఉదయం 11.55 గంటలకు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను అక్కడికి తరలించారు. పేలుడులో గాయపడిన నలుగురిని అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే సిలిండర్ ఎందుకు పేలిందనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఇటీవల సత్యనికేతన్ ప్రాంతంలో ఓ పీజీ భవనం కూలిన ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవన యజమాని హరిరామ్, ఆయన భార్య ఊర్మిళ, కుమారుడు మహేష్ బన్సల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భవనాన్ని శుభం త్యాగి, శుభాన్షు అనే వ్యక్తులకు లీజుకు ఇచ్చినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో శుభాన్షును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శుభం కోసం గాలింపు కొనసాగుతోంది. ‘హాస్టల్ డేస్’ పేరుతో ఈ పీజీని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
also read : ఢిల్లీ మాజీ సీఎస్ రాకేశ్ మెహతా ఆత్మహత్య.. లేఖలో కీలక విషయాలు
