క్రైమ్ మిర్రర్ : కేరళలో శుక్రవారం అర్ధరాత్రి దాటకముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. త్రిశూర్ జిల్లాలోని పనంబికున్ను సమీపంలో జాతీయ రహదారి-66పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తమిళనాడుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని దిండిగల్కు చెందిన పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కేరళ పర్యటనలో ఉన్నారు. గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో పనంబికున్ను వద్ద 66వ జాతీయ రహదారిపై ఓ లారీ రోడ్డుపై నిలిచిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న విద్యార్థుల కారు అదుపు తప్పి వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా ఉండటంతో ఢీకొన్న సమయంలో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి కారు తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో విద్యార్థులు ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసేందుకు ప్రత్యేక పరికరాలతో కారును కట్ చేయాల్సి వచ్చింది.
క్షతగాత్రులను బయటకు తీసిన అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిశూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read :అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు గల్లంతు
