క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కొలువుదీరే గణనాథుని మండపాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు అనుమతుల కోసం ఇకపై పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా, ప్రక్రియను పూర్తిగా సరళతరం చేసింది. మండపాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సింగిల్ విండో విధానాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఆన్‌లైన్ సింగిల్ విండో విధానాన్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. గతంలో గణేష్ మండపం ఏర్పాటు చేయాలంటే పోలీస్, ఫైర్, మున్సిపల్, విద్యుత్ , మరియు రెవెన్యూ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు (NOCలు) తీసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, సమయం కూడా వృథా అయ్యేది. ఈ కష్టాలను తీర్చి, పారదర్శకతను పెంచేందుకే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఒకే దరఖాస్తుతో అన్ని సంబంధిత శాఖల అనుమతులను సులభంగా పొందవచ్చని ఆయన తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మండప నిర్వాహకులు https://ganeshutsav.net/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని డీజీపీ సూచించారు. వెబ్‌సైట్‌లో మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేసి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే అనుమతులు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, సంబంధిత అధికారుల బృందం దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను చెక్ చేస్తుంది. అనంతరం, మండపం ఏర్పాటు చేయదలచిన స్థలాన్ని భౌతికంగా పరిశీలిస్తారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా, స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా స్థలం ఉందో లేదో తనిఖీ చేస్తారు. భద్రత మరియు సౌలభ్యం దృష్ట్యా అవసరమైతే మండప ఏర్పాటులో మార్పులు, చేర్పులను కూడా అధికారులు సూచిస్తారని డీజీపీ పేర్కొన్నారు. అధికారుల సూచనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు పెద్ద ఊరట లభించింది.
‘చంద్రబాబు అనే నేను’.. బహిరంగ సభల్లో సరికొత్త స్టైల్‌తో అదరగొడుతున్న ఏపీ సీఎం!
