సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఓ ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి.
అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
సీసీ ఫుటేజ్‌లో అనుమానాస్పద వ్యక్తి
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ ప్రాంతంలో సంచరించినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
దీంతో బైక్‌లకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
సీసీ ఫుటేజ్‌తో పాటు ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు.. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటన వెనుక కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
also read: చంచల్‌గూడ జైలులో విషాదం.. రిమాండ్ ఖైదీ మృతి
