నేపాల్‌ను భారీ వరదలు వణికిస్తున్న వేళ.. ప్రకృతి విపత్తు మధ్య కొందరి ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వరద నీటిలో కొట్టుకువచ్చిన బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను తెరిచి అందులోని నగదును అపహరించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 92,68,505 నేపాలీ రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.57 లక్షలు.
పోలీసుల వివరాల ప్రకారం.. రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో వరద ఉద్ధృతికి ఓ బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. అనంతరం అది ధాడింగ్ జిల్లా పరిధిలోని త్రిశూలి నది సమీపంలో కనిపించింది. అయితే లాకర్‌ను గుర్తించిన కొందరు వ్యక్తులు దాన్ని బలవంతంగా తెరిచి, అందులోని నగదును తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించి.. అనుమానితులను గుర్తించాయి. మొత్తం 29 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నాయి. అరెస్టైన వారి వయసు 19 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో వరదల నేపథ్యంలో మరో అమానవీయ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నారాయణి నదిలో లభించిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవి కమ్మలను ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కాగా, నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో హిమానీనదం విస్ఫోటనం కారణంగా భారీ వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తుతో పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతైనట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ శనివారం వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
also read: నోరా ఫతేహిపై సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు.. లేఖలో ఏముందంటే?
