రాఖీ పండుగ సందర్భంగా అన్నను కలిసేందుకు వచ్చిన ఓ మహిళ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఆమె రెండేళ్ల కుమారుడు గోబర్ గ్యాస్ గుంతలో పడి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగ నేపథ్యంలో తన సోదరుడిని కలిసేందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్‌లోని డీఈసీ కంపెనీకి వచ్చింది. ఆమె సోదరుడు అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన ఆమె రెండేళ్ల కుమారుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు కంపెనీ పరిసరాల్లో ఉన్న గోబర్ గ్యాస్ గుంతలో పడిపోయాడు. బాలుడు గుంతలో పడిన విషయాన్ని గుర్తించిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాఖీ పండుగ కోసం వచ్చిన చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, కంపెనీ పరిసరాల్లో ప్రమాదకరమైన గుంత ఉన్నప్పటికీ తగిన భద్రతా చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంత చుట్టూ రక్షణ ఏర్పాట్లు, హెచ్చరిక బోర్డులు వంటి భద్రతా చర్యలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు కారణమైన పరిస్థితులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
also read: పాక్ ఏజెంట్‌గా అనుమానం.. రాజస్థాన్‌లో బల్విందర్ సింగ్ అరెస్ట్
