క్రైమ్ మిర్రర్ : సైబర్ మోసాలకు తన బ్యాంకు ఖాతాను నేరగాళ్లు వినియోగించినట్లు తెలుసుకున్న ఓ మహిళ తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. డొంబివ్లీ ప్రాంతంలో నివసించే 38 ఏళ్ల దేవిక ఆర్ముగం పండారమ్‌కు ఆగస్టు 8న రాజస్థాన్‌లోని చురు సైబర్ సెల్ పోలీసులు నోటీసు అందజేశారు. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి ఆమె బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాను వినియోగించినట్లు పోలీసులు అనుమానించారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ విషయం తెలియడంతో దేవిక ఆందోళనకు గురైంది. కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు థానే పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించింది. అక్కడి అధికారులు ఆమె బ్యాంకు ఖాతాకు సంబంధించి పలు రాష్ట్రాల్లో సైబర్ మోసం కేసులు నమోదైనట్లు తెలిపినట్లు సమాచారం.రాజస్థాన్‌తో పాటు గుజరాత్, హర్యానా, బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఆమె ఖాతా వినియోగంపై కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
విచారణ భయంతో విషాద నిర్ణయం
పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో విచారణ కోసం తాను వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందనే ఆందోళన దేవికను మరింత కలవరపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 26న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శాస్త్రినగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేవిక బ్యాంకు ఖాతాను ఎవరు, ఎలా వినియోగించారు? సైబర్ మోసాలకు సంబంధించి ఆమెకు ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? లేక ఆమె ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
also read : దారుణం.. మహిళను హత్య చేసి డబ్బాలో పాతి పెట్టిన వైనం
