మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్), యూటీఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను, ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా ఉన్నట్లు భావిస్తున్న సన్నివేశాలను సినిమాకు సంబంధించి వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి స్పందించారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే సన్నివేశాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్న సన్నివేశాలపై చిత్ర బృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
also read: నేపాల్-టిబెట్ సరిహద్దులో జలప్రళయం.. భూకంపం కాదు, గ్లేసియర్ విరిగిపడటమే కారణం!
