క్రైమ్ మిర్రర్ : సెల్‌ఫోన్ చోరీతో పాటు సైబర్ మోసాలను కలిపి కొత్త తరహా ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’కు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు సుమారు రూ.25 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సెల్‌ఫోన్ చోరీకి గురైన తర్వాత బాధితులు ఆందోళనకు గురవుతుండటాన్ని నిందితులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు దొంగిలిస్తున్నట్లు గుర్తించారు.
‘మీ ఫోన్ మా దగ్గర ఉంది’ అంటూ మోసం
ఫోన్ పోయిన కొద్దిసేపటికే బాధితుడు తన నంబర్‌కు కాల్ చేస్తే.. ఫోన్ తమ వద్దే ఉందని నిందితులు చెబుతారు. అయితే అది నిజంగా బాధితుడి ఫోనేనా అని నిర్ధారించుకోవాలంటూ స్క్రీన్ లాక్ పాస్‌వర్డ్ చెప్పాలని అడుగుతారు. బాధితుడు పాస్‌వర్డ్ చెప్పిన వెంటనే ఫోన్‌ను అన్‌లాక్ చేసి అందులోని వాట్సాప్, గ్యాలరీ, నోట్స్ తదితరాలను పరిశీలిస్తారు. ఫోన్‌లో భద్రపరిచిన బ్యాంకు వివరాలు, యూపీఐ సమాచారం, పిన్ నంబర్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ఫొటోలు, బ్యాంకు పాస్‌బుక్ చిత్రాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత యూపీఐ పాస్‌వర్డ్‌లను మార్చడం లేదా రీసెట్ చేయడం ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు. కొంత మొత్తాన్ని మ్యూల్ బ్యాంక్ ఖాతాలకు, మరికొంతను ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారా మళ్లిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు బదిలీ పూర్తయిన తర్వాత ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలి?
సెల్‌ఫోన్ చోరీకి గురైనప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి స్క్రీన్ లాక్ పాస్‌వర్డ్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని పోలీసులు సూచించారు. ఫోన్ తమ వద్ద ఉందని చెప్పినా.. ఫోన్‌లోనే పాస్‌వర్డ్ వివరాలు వెల్లడించకూడదని స్పష్టం చేశారు. ఫోన్ పోయిన వెంటనే సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సిమ్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. అనంతరం బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి యూపీఐ, బ్యాంకింగ్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలిపారు. అలాగే CEIR పోర్టల్‌లో మొబైల్ చోరీ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఫోన్ తమ వద్ద ఉందని ఎవరైనా చెప్పినప్పుడు.. వ్యక్తిగతంగా కలుసుకుని ఫోన్‌ను తీసుకునే వరకు ఎలాంటి పాస్‌వర్డ్ వివరాలను వెల్లడించకూడదని పోలీసులు హెచ్చరించారు.
ముగ్గురు అరెస్ట్.. ఐదు ఫోన్లు స్వాధీనం
సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడే కొందరు వ్యక్తులు టెక్నికల్ పరిజ్ఞానం ఉన్న వారితో కలిసి ఈ తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ముఠా సుమారు రూ.25 లక్షలు మోసం చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ క్రైమ్ డీసీపీ చైతన్యకుమార్, ఆయన బృందాన్ని సీపీ అభినందించారు.
also read : చింతూరు పోలీసుల ఎదుట ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
