క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని టార్గెట్ చేశారు. దర్యాప్తు సంస్థ అధికారినంటూ ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. బాధితుడిని భయపెట్టి భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. బాధితుడి ఆధార్ వివరాలను ఉపయోగించి రూ.2.50 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ వెరిఫికేషన్ అవసరమని నమ్మించాడు. అందులో భాగంగా ఓ బ్యాంక్ ఖాతాలో రూ.85.20 లక్షలు జమ చేయాలని సూచించాడు.
నిందితుడి మాటలను నిజమని నమ్మిన బాధితుడు అతను చెప్పిన ఖాతాకు రూ.85.20 లక్షలను బదిలీ చేశాడు. అనంతరం మరో రూ.42 లక్షలు చెల్లించాలని నిందితుడు ఒత్తిడి చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న తెలంగాణ సైబర్ పోలీసులు వేగంగా స్పందించారు. దర్యాప్తులో భాగంగా కోయంబత్తూరులోని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ శాఖలో ఉన్న నిందితుడి ఖాతాను గుర్తించారు. ఆ ఖాతాలో అప్పటికే ఉన్న రూ.85.20 లక్షలను ఫ్రీజ్ చేశారు. దీంతో బాధితుడి డబ్బులో భారీ మొత్తాన్ని కాపాడగలిగారు. ప్రస్తుతం నిందితుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా అధికారులు అంటూ బెదిరించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.
also read : ప్యాకేజ్డ్ ఫుడ్‌పై రెడ్ వార్నింగ్ లేబుళ్లు.. కంపెనీల వ్యతిరేకత
