హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి హత్య కేసు కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం చివరకు ఓ యువతి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన 21 ఏళ్ల రహీన పహాడీషరీఫ్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివసిస్తూ, ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అహ్మద్ కూడా అక్కడే పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
ఇటీవల రహీన గర్భవతి అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని అహ్మద్‌కు తెలియజేసి తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చి యువతి హత్యకు దారితీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రహీనను అహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులు కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అర్థరాత్రి సమయంలో వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా తదితర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసలు హత్యకు దారితీసిన కారణాలు, ఘటనలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో పరిచయం ఏర్పడి.. పెళ్లి విషయంలో వివాదం తలెత్తి.. చివరకు ఓ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులపై వచ్చిన ఆరోపణలు కోర్టు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది.
also read: తాండూరులో కల్తీ కోవా, కలాఖండ్ కలకలం.. రూ.3.48 లక్షల సరుకు స్వాధీనం
