క్రైమ్ మిర్రర్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గాంధీపురం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఇంటర్మీడియట్ విద్యార్థులు పదో తరగతి విద్యార్థులను గదిలోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థులను దుస్తులు తొలగించి చితకబాదినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురుకులంలో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖోలో ఇంటర్మీడియట్ విద్యార్థులు విజయం సాధించగా.. కబడ్డీలో పదో తరగతి విద్యార్థులు గెలుపొందారు. ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విజేతలకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
కబడ్డీలో విజయం సాధించడంతో పదో తరగతి విద్యార్థులు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అయితే వారి విజయాన్ని చూసి ఆగ్రహానికి గురైన కొందరు ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థులను గదిలోకి తీసుకెళ్లి ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. వారిపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు స్టడీ అవర్ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడికి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. ఇంటర్ విద్యార్థులు పదో తరగతి విద్యార్థులను పరిగెత్తించి మరీ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భయపడిన కొందరు పదో తరగతి విద్యార్థులు రాత్రంతా రైల్వే స్టేషన్‌తో పాటు సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.
తెల్లవారిన తర్వాత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో హుటాహుటిన గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్‌పై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
also read:Akshay Kumar: అక్షయ్ కుమార్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ.. రానాతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్…?
